Showing posts with label which states ban meat. Show all posts
Showing posts with label which states ban meat. Show all posts

Thursday, 10 September 2015

రాజస్థాన్, అహ్మదాబాద్ లో కూడా మాంసం బ్యాన్

 

గోమాంసం, ఇతర మాంసం అమ్మకాలపై నిషేధం రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, అహ్మదాబాద్ లకు కూడా విస్తరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో స్వయంగా హైకోర్టే నిషేధం విధించింది. ఇక రాజస్థాన్ ఈ నెల 17,18, 27 తేదీల్లో జైన్ ల పండుగ సందర్భంగా మాంసం, చేపల అమ్మకాన్ని నిషేధించింది. ఆ రోజుల్లో దుకాణాలు తెరవకూడదని ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. 17న జైన్ ఉపవాసదీక్షాదినం ప్రయుషన్ , సెప్టెంబర్ 18న మరో జైన్ పండుగ సంవత్సరి, సెప్టెంబర్ 27న అనంత చతుర్థశి నేపథ్యంలో ఈ నిషేధం విధించింది. కబేళాలకూ ఈ నిషేధం వర్తిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో హై కోర్టు నిషేధం విధించడంతో జమాయిత్ ఈ ఇస్లామీ, సంస్థ, హురియత్ కాన్ఫరెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక అహ్మదాబాద్ లో పోలీసు కమిషనర్ సత్యానంద్ ఝా వారం రోజుల పాటు కోళ్లు, గొర్రెలతో పాటు అన్ని జంతువుల వధను నిషేధించారు.
ముంబైలో మాంసంపై బ్యాన్ పై తలెత్తిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ ప్రభుత్వం మాంసం అమ్మకాలను నిషేధిస్తే.. ఆ సర్కార్ లో భాగస్వామ్య పార్టీ శివసేన నిషేధాన్ని వ్యతిరేకిస్తోంది.
నిషేధాజ్ఞలను ధిక్కరించి గురువారం ముంబైలో పలుచోట్ల ప్రభుత్వ మిత్రపక్షం శివసేనతో పాటు ఎమ్మెన్నెస్ నాయకులు దగ్గరుండి మాంసం విక్రయాలను జరిపించారు. మతం పేరిట నిషేధాజ్ఞలు విధించడమేమిటని మండిపడ్డారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్లాటర్‌హౌస్‌లలో మాత్రం విక్రయాలు జరగలేదు. కాగా, నాలుగురోజులపాటు విక్రయాలను నిషేధించడం చట్టవిరుద్ధమని, తాము జీవనోపాధి కోల్పోతామని ముంబై మటన్ ట్రేడర్స్ ప్రతినిధులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో మాంసం విక్రయాలను నిషేధించడం సాధ్యంకాదని, దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే చూడాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశిస్తూ విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.