Tuesday, 8 September 2015

యెమన్ దాడుల్లో భారతీయులు మృతి

 

యెమన్‌లో చమురు స్మగ్లర్లు, షియా ఉగ్రవాదులు లక్ష్యంగా సౌదీ అరేబియా మిత్రదేశాల కూటమి జరిపిన వైమానిక దాడిలో 20 మంది భారతీయులు చనిపోయినట్లు సమాచారం.
హోదిదీ రేవు సమీపంలోని అల్ ఖోఖా ప్రాంతంపై జరిగిన దాడిలో రెండు బోట్లపై బాంబులు పడినట్టు చెబుతున్నారు. ఈవారం ప్రారంభంలో 45మంది ఎమిరైట్ సైనికులను పొట్టన పెట్టుకున్న తిరుగుబాటుదారుల మిసైల్ దాడి జరిగిన మరిబ్ రాష్ట్రంలో సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు జరిపిన దాడిలో 12మంది షియా తిరుగుబాటుదారులూ మృతి చెందినట్టు యెమన్ భద్రతాదళాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను బట్టి తెలుస్తోంది. అయితే వారెవరూ కూడా అధికారికంగా ఈ విషయాలు చెప్పకపోవడం గమనార్హం.
మంగళవారం యెమన్ లో సౌదీ విమానాలు 20 చోట్ల వైమానికి దాడులు చేసినట్లు తిరుగుబాటు సంస్థ హుతీ పేర్కొంది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన వైమానిక దాడిలో 12 మంది పౌరులు చనిపోయినట్లు హుతీ మీడియా విభాగం ప్రకటించింది. సోమవారం కూడా వైమానిక దాడులు చేయటంతో 15 మంది చనిపోయారు. కాగా, యెమన్‌లో వైమానిక దాడిలో భారతీయులు మరణించినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగశాఖ తెలిపింది.
సనా, ఇతర రాష్ట్రాలను విముక్తం చేయడానికి జాతీయ ఆర్మీని సిద్ధం చేయడంలో భాగంగా పది వేల మంది యెమన్ పోరాట యోధులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈ దాడులు జరిగాయి. శుక్రవారం హుతి తిరుగుబాటు ముఠా జరిపిన మిసైల్ దాడిలో 60మంది సంకీర్ణ సైనికులు మృతి చెందిన తర్వాత సౌదీ నేతృత్వంలోని గల్ఫ్ అరబ్ దేశాలు కూడా వేల సంఖ్యలో అదనపు బలగాలను యెమన్‌కు పంపించినట్టు కూడా తెలుస్తోంది.ఇదిలా ఉండగా ఇరాన్ మద్దతుతో చెలరేగుతున్న హుతీ తిరుగుబాటుదారులను తుదముట్టించేందుకు ఉపరితల యుద్ధం ప్రారంభిస్తున్నట్లు సౌదీ మిత్రకూటమి ప్రకటించింది.

No comments:

Post a Comment