Wednesday, 26 August 2015

హింసాత్మకంగా మారిన పటేళ్ల ఆందోళన

 

గుజరాత్‌లో పటేల్‌ సామాజికవర్గం ఆందోళన హింసాత్మకంగా మారింది. బుధవారం బంద్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. తమను ఓబీసీలుగా గుర్తించాలని హార్ధిక్‌ పటేల్‌ నేతృత్వంలో పటేల్‌ సామాజికవర్గం కొంతకాలంగా ఆందోళనలు చేస్తోంది. అందులో భాగంగా మంగళవారం అహ్మదాబాద్‌లో పటేళ్లు భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం గుజరాత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ నేపథ్యంలో మంగళవారం రాత్రి హార్ధిక్‌ పటేల్‌ను పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ వార్త తెలియగానే ఆందోళనకారుల చెలరేగిపోయారు. పోలీసులు వెనక్కి తగ్గినా మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. దీంతో బుధవారం రాష్ట్ర బంద్‌ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరిగింది. పలు చోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు నడుమ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌ సహా పలు పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. పోలీసుల కాల్పుల్లో అహ్మదాబాద్‌లో ముగ్గురు, బనసకాంత జిల్లాలో ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఘటోల్డియాలో జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి మరణించాడు. సూరత్‌లో ఆందోళనకారుల దాడిలో ఓ పోలీసు మృతి చెందారు.
వందకుపైగా బస్సులను, పలు ప్రైవేటు కార్లను, మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు. రాజ్‌కోట్‌లో కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ మోహన్ కుందరియాకు చెందిన రెండు ఆఫీసులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఉత్తర గుజరాత్‌లో రాష్ట్ర హోం మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేల కార్యాలయాలను దహనం చేశారు. రెండు ఏటీఎంలు అగ్నికి ఆహుతయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇప్పటికే ఐదువేల పారామిలిటరీ సిబ్బందిని పలునగరాల్లో మోహరించారు.
‘గాంధీ, సర్దార్‌ పటేల్‌ వంటి గొప్ప వ్యక్తులు పుట్టిన గడ్డపై హింస చెలరేగడం సరికాదు. ప్రతి ఒక్కరూ హింసను వీడి శాంతితో మెలగాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని గుజరాతీలో మోదీ పిలుపునిచ్చారు. వీహెచ్‌పీ నేత ప్రవీణ్‌ తొగాడియా సైతం ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని కోరారు.

No comments:

Post a Comment