Krishna Reddy MLA Sudden Death Dew to Heart Attack in Telangana State
హైదరాబాద్/బేగంపేట, నమస్తే తెలంగాణ: మెదక్ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు, పార్టీ నేతల ఆదరాభిమానాలు పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత, నారాయణఖేడ్ ఎమ్మెల్యే, శాసన సభలో ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పట్లోళ్ళ కిష్టారెడ్డి (74) గుండెపోటుతో కన్నుమూశారు. కిష్టారెడ్డికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. హైదరాబాద్‌లోని సంజీవరెడ్డినగర్‌లో ఉంటున్న కిష్టారెడ్డికి నిద్రలోనే గుండెపోటు వచ్చింది. మంగళవారం ఉదయం ఎంతకీ నిద్రలేవకపోవడంతో.. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను కిమ్స్ దవాఖానకు తరలించారు. అప్పటికే కిష్టారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు ఆయన కుమారుడు సంజీవరెడ్డి తెలిపారు. కిష్టారెడ్డి భౌతిక కాయాన్ని అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం మంగళవారం సాయంత్రం సొంత నియోజకవర్గం నారాయణఖేడ్‌కు తరలించారు. బుధవారం కిష్టారెడ్డి అంత్యక్రియలు నారాయణఖేడ్‌లో అధికార లాంఛనాలతో జరుగనున్నాయి.
కిష్టారెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి అకాల మరణంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా కిష్టారెడ్డి సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వ లాంఛనాలతో కిష్టారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. మెదక్ జిల్లాలోని కిష్టారెడ్డి స్వగ్రామమైన పంచగామ గ్రామంలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కిష్టారెడ్డి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
No comments:
Post a Comment