Tuesday, 25 August 2015

Arts Courses In IIT campus


Arts Courses In IIT campus


హ్యుమానిటీస్, లా, లాంగ్వేజ్‌లు కూడా
* ఎప్పటి నుంచో కొన‌సాగుతున్న ఎమ్మెస్సీ, ఎంబీఏ
* మ‌రో రెండేళ్లలో ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ నుంచి ఎంబీబీఎస్
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీల‌గా జ‌గ‌ద్విఖ్యాత‌మైన ఐఐటీల ప‌రిధి మ‌రింత విస్తృత‌మ‌వుతోందా? అంటే అవున‌నే స‌మాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఐఐటీలంటే బీటెక్, ఎంటెక్‌లే కాదు. వీటిలో ఎంబీఏ, ఎమ్మెస్సీ కోర్సులు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంతేకాదు.. గ‌త కొన్నేళ్లగా హ్యుమానిటీస్‌, సోష‌ల్ సైన్సెస్‌, లా…ఇలా ప‌లు ర‌కాల కోర్సులు మ‌న ఐఐటీల్లో బోధిస్తున్నారు. తాజాగా ఇదే దారిలో ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ మ‌రో అడుగు ముందుకేసింది. ఈ సంస్థ 2017 విద్యా సంవ‌త్సరం నుంచి ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించ‌డానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకుంటోంది. ప‌దిహేనేళ్ల కింద‌టే వైద్యవిద్యార్థుల‌కోసం మెడిక‌ల్ టెక్నాల‌జీ కోర్సును ఈ ఐఐటీ ప్రారంభించింది. ప్రస్తుతం పాత‌త‌రం ఐఐటీల‌న్నీ వినూత్న కోర్సుల బాట ప‌డుతూ విద్యార్థుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. వీటిద్వారా ఆర్ట్స్, హ్యుమానిటీస్‌, లా, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌..ల్లో ప‌లు కోర్సులు అందుబాటులోకొచ్చాయి. దీంతో అన్ని గ్రూపుల విద్యార్థుల‌కూ ఐఐటీల గ‌డ‌ప‌తొక్కే భాగ్యం క‌లుగుతోంది. కొత్త కోర్సుల ప్రభావంతో ఐఐటీలంటే నాణ్యమైన ఇంజినీర్లే కాదు లాయ‌ర్లు, డాక్టర్లు, వ్యాపార‌వేత్తలు, ఆర్థిక వేత్తలు, చ‌రిత్రకారులు, …ఇలా అన్ని రంగాల్లోనూ నిష్ణాతులు ఆవిర్భవించ‌డానికి అవ‌కాశాలేర్ప‌డ్డాయి.. ప‌లు ఐఐటీల్లో ఉన్న ప్రత్యేక కోర్సులు, వాటిలో ప్రవేశానికి అర్హత‌లు, ప‌రీక్షల గురించి తెలుసుకుందాం.
ఎంఏ @ ఐఐటీ మ‌ద్రాస్‌
2006లో ఐఐటీ-మ‌ద్రాస్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల‌కు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో ఎంఏ డెవ‌ల‌ప్‌మెంట్ స్టడీస్‌, ఎంఏ ఇంగ్లిష్ స్టడీస్‌ల‌ను బోధిస్తున్నారు. హ్యుమానిటీస్ అండ్ సోష‌ల్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామినేష‌న్ (హెచ్ఎస్ఈఈ) ద్వారా కోర్సుల్లో ప్రవేశం క‌ల్పిస్తారు. ఏటా ఏప్రిల్‌లో ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వహిస్తారు. ఒక్కో కోర్సుకీ 23 మంది చొప్పున మొత్తం 46 మంది విద్యార్థుల‌ను చేర్చుకుంటారు.
ప‌రీక్ష ఇలా: మూడు గంట‌ల వ్యవ‌ధిలో 2 పేప‌ర్లు రాయాలి. పేప‌ర్ 1 వ్యవ‌ధి రెండున్నర గంట‌లు. ఇది కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌. ఇందులో ఇంగ్లిష్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్స్‌, ఎన‌లిటిక‌ల్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జ‌న‌ర‌ల్ స్టడీస్ (స్వాంతంత్ర్యానంత‌రం భార‌త ఆర్థిక రంగం, భార‌త స‌మాజం, వ‌ర్తమాన ప్రంపంచం, ప‌ర్యావ‌ర‌ణం…) ప్రశ్నల‌డుగుతారు. ఇంగ్లిష్ నుంచి 25 శాతం, ఎన‌లిటిక‌ల్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 25 శాతం, జ‌న‌ర‌ల్ స్టడీస్ నుంచి 50 శాతం ప్రశ్నలొస్తాయి. పేప‌ర్ 2 వ్యాస‌రూపంలో ఉంటుంది. వ్యవ‌ధి అర‌గంట‌. పేప‌ర్‌పైనే రాయాల్సి ఉంటుంది. అవ‌స‌ర‌మైతే పేప‌ర్‌ప‌రీక్ష బ‌దులు చ‌ర్చ కూడా నిర్వహిస్తారు.
అర్హత‌: 60 (ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ విద్యార్థులైతే 55 ) శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థులూ ప‌రీక్ష రాసుకోవ‌చ్చు.
వెబ్‌సైట్‌: http://hsee.iitm.ac.in/index.html
లా @ ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌
ఎల్ఎల్‌బీ (ఇంట‌లెక్చువ‌ర్ ప్రాప‌ర్టీ లా) కోర్సును ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ అందిస్తోంది. ఇది మూడేళ్ల బ్యాచిర‌ల్ డిగ్రీ కోర్సు. రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల‌ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.
అర్హత‌: ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ లేదా త‌త్సమాన కోర్సులో ప్రథ‌మ శ్రేణి మార్కుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. సైన్స్ లేదా ఫార్మసీ కోర్సుల్లో ప్రథ‌మ శ్రేణితో పీజీ పూర్తిచేసిన‌వాళ్లూ ఈ కోర్సుకు అర్హులే. పై రెండు కోర్సుల్లో వేటినైనా చదివి, 60 శాతం మార్కుల‌తో ఎంబీఏ ఉత్తీర్ణులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
రాత ప‌రీక్షలో: వివిధ అంశాల్లో అభ్యర్థి ప‌రిజ్ఞానాన్ని ప‌రిశీలిస్తారు. ఇంగ్లిష్ నుంచి 40, లాజిక‌ల్ రీజ‌నింగ్ 20, మ్యాథ‌మెటిక‌ల్ ఎబిలిటీ 15, బేసిక్ సైన్స్ (కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, లైఫ్ సైన్స్‌) 35, లీగ‌ల్ ఆప్టిట్యూడ్ 60, ఎస్సే 30 మార్కుల‌కు ప్రశ్నలు ఉంటాయి.
వెబ్‌సైట్‌: www.iitkgp.ac.in/topfiles/law.php
డెవ‌ల‌ప్‌మెంట్ స్టడీస్ @ ఐఐటీ గువాహ‌తి
ఎంఏ డెవ‌ల‌ప్‌మెంట్ స్టడీస్ కోర్సును ఐఐటీ గువాహ‌తి 2009 నుంచి అందిస్తోంది. మొత్తం 48 సీట్లు ఉన్నాయి. రాతప‌రీక్ష ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది. దీనికోసం ఫిబ్రవ‌రి లేదా మార్చి నెల‌ల్లో ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. సాధార‌ణంగా జూన్‌లో ప‌రీక్ష నిర్వహిస్తారు.
రాత ప‌రీక్షలో: ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్ విధానాల్లో ప్రశ్నలుంటాయి. వ‌ర్తమాన వ్యవ‌హారాలు, అర్థశాస్త్రం, రాజ‌కీయాలు, స‌మాజం…త‌దిత‌రాంశాల్లో తాజా స‌మాచారంపై ప్రశ్నలుంటాయి. వీటితోపాటు లాజిక‌ల్ రీజ‌నింగ్ లోనూ అభ్యర్థి అవ‌గాహ‌న‌ను ప‌రీక్షిస్తారు.
వెబ్‌సైట్: www.iitg.ac.in/hss
ఎక‌నామిక్స్‌@ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌
ఎమ్మెస్సీ ఎక‌నామిక్స్ పేరుతో ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌కోర్సు అందిస్తోంది. ఐఐటీ-జేఈఈ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం ల‌భిస్తుంది.
వెబ్‌సైట్: www.iitkgp.ac.in
ఎంహెచ్ఆర్ఎం@ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌
మాస్టర్ ఆఫ్ హ్యూమ‌న్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ ఎంటెక్ కోర్సు అందిస్తోంది. ఈ కోర్సుకు ఇంజినీరింగ్ విద్యార్థులు అర్హులు. రాత ప‌రీక్ష ద్వారా ప్రవేశం క‌ల్పిస్తారు. ఎంహెచ్ఆర్ఎంను 2010లో ప్రారంభించారు.
వెబ్‌సైట్: www.iitkgp.ac.in
ఎంఎంఎస్‌టీ@ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌
మాస్టర్ ఇన్ మెడిక‌ల్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (ఎంఎంఎస్‌టీ) కోర్సును ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ అందిస్తోంది. ఈ కోర్సులో చేరాలంటే 55 శాతం మార్కుల‌తో ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించాలి. దీనితోపాటు ఇంట‌ర్లో మ్యాథ్స్ చ‌ద‌వ‌డం త‌ప్పనిస‌రి. (గ‌ణితాన్ని అద‌న‌పు స‌బ్జెక్టుగా చ‌దివిన‌వారూ అర్హులే). రాత ప‌రీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ఇందులో 120 ప్రశ్నలుంటాయి. 75 ప్రశ్నలు ఎంబీబీఎస్ సిల‌బ‌స్ నుంచే అడుగుతారు. మిగిలినవి ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల నుంచి వ‌స్తాయి. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. ప‌లు అంత‌ర్జాతీయ‌, జాతీయ సంస్థల‌తో అవ‌గాహ‌న ఏర్పర‌చుకుని ఈ కోర్సును 2001 నుంచి బోధిస్తున్నారు. కోర్సు వ్యవ‌ధి మూడేళ్లు.
వెబ్‌సైట్‌: www.iitkgp.ac.in/academics/?page=acadunits&&dept=MD
పీహెచ్‌డీ కోర్సులు @ ఐఐటీ దిల్లీ
ఎక‌నామిక్స్‌, లింగ్విస్టిక్స్‌, లిట‌రేచ‌ర్‌, ఫిలాస‌ఫీ, పాల‌సీ, సైకాల‌జీ, సోషియాల‌జీ స‌బ్జెక్టుల్లో ఐఐటీ దిల్లీ పీహెచ్‌డీ కోర్సులు నిర్వహిస్తోంది.
వెబ్‌సైట్‌: http://hss.iitd.ac.in
ఎంఏ సొసైటీ అండ్ క‌ల్చర్@ ఐఐటీ గాంధీన‌గ‌ర్‌
ఎంఏ సొసైటీ అండ్ క‌ల్చర్ రెండేళ్ల కోర్సుని ఐఐటీ గాంధీన‌గ‌ర్ అందిస్తోంది. ఏదైనా డిగ్రీలో 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు అర్హులు. రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. 15 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో చేరిన అర్హుల‌కు నెల‌కు రూ.5000 చొప్పున స్కాల‌ర్‌షిప్ చెల్లిస్తారు. ప‌రీక్షలో ఇంగ్లిష్ రీడింగ్ కాంప్రహెన్షన్లు ఇచ్చి వాటిపై ప్రశ్నల‌డుగుతారు. డిగ్రీ ఆఖ‌రు సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వెబ్‌సైట్‌: http://hss.iitgn.ac.in/masc
ఎమ్మెస్సీ కాగ్నెటివ్ సైన్స్‌@ ఐఐటీ గాంధీన‌గ‌ర్‌
రెండేళ్ల ఎమ్మెస్సీ కాగ్నెటివ్ సైన్స్ కోర్సుని ఐఐటీ గాంధీన‌గ‌ర్ నిర్వహిస్తోంది. ఏదైనా డిగ్రీలో 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు అర్హులు. రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ప‌రీక్షలో ఇంగ్లిష్ రీడింగ్ కాంప్రహెన్షన్లు ఇచ్చి వాటిపై ప్రశ్నల‌డుగుతారు.ఈ కోర్సులో చేరిన అర్హుల‌కు నెల‌కు రూ.5000 చొప్పున స్కాల‌ర్‌షిప్ చెల్లిస్తారు. 15 సీట్లు ఉన్నాయి. డిగ్రీ ఆఖ‌రు సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వెబ్‌సైట్‌: http://cogs.iitgn.ac.in
ఎంబీబీఎస్‌@ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌
మ‌రో రెండేళ్ల‌లో అంటే 2017 విద్యా సంవ‌త్సరం నుంచి ఎంబీబీఎస్ కోర్సును బోధించ‌డానికి ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ స‌న్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం ఇక్కడ ఎంఎంఎస్‌టీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ ఐఐటీలో ఎంబీబీఎస్ కోర్సులో చేరాలంటే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ నిర్వహించే ఎయిమ్స్ టెస్ట్‌ లేదా ప్రి మెడిక‌ల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అయితే ప్రవేశ విధానం, సీట్ల సంఖ్య గురించి ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ వివ‌రాలు ప్రక‌టించాల్సి ఉంది.


No comments:

Post a Comment